: పీట్ సాంప్రాస్ ను వెంటాడిన పారిస్ 'దయ్యాలు' జకోవిచ్ నీ వదల్లేదు!


పీట్ సాంప్రాస్... 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన అమెరికన్ టెన్నిస్ దిగ్గజం. ఏడు వింబుల్డన్, ఐదు యూఎస్ ఓపెన్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. కానీ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం అతనికి అందని ద్రాక్షే అయింది. 1996లో సెమీ ఫైనల్ కు చేరుకున్నదే ఫ్రెంచ్ ఓపెన్ లో పీట్ అత్యుత్తమ ప్రదర్శన. 13 సంవత్సరాలు బరిలోకి దిగినా, కప్పు గెలవలేకపోయాడు. ఒక్క పీట్ మాత్రమే కాదు స్టిఫాన్ ఎడ్ బర్గ్, బోరిస్ బేకర్ వంటి వాళ్లెందరో దిగ్గజాలకు 'ఫ్రెంచ్' కప్పు అందలేదు. చిన్న వయసులో ఉన్నప్పుడే ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలని, వయసు పెరుగుతున్న కొద్దీ టైటిల్ నెగ్గడం చాలా క్లిష్టతరమవుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే సమయంలో ఫ్రెంచ్ ఓపెన్ మైదానాల్లో దయ్యాలు తిరుగుతుంటాయని విశ్వసించే వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా నెంబర్-2 కోర్టులో ఆడిన ఎందరో టాప్ సీడెడ్లు అనామకుల చేతుల్లో పరాభవాన్ని చవిచూశారు. ఇందుకు కారణం దయ్యాలేనని వీనస్ విలియన్స్ కూడా ఒక సందర్భంలో ఆరోపించింది. ఈ దయ్యాలు ఒకసారి పట్టుకుంటే అసలు వదలవని, వారికి టైటిల్ ను రానివ్వవని ఎంతో మంది భావిస్తుంటారు. అటువంటి దయ్యాలే నెంబర్ 1గా ఉన్న జకోవిచ్ ని ఫైనల్లో ఓడించాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇప్పటికే 12 సార్లు జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పోటీల్లో పాల్గొన్నాడు. వచ్చే సంవత్సరం అంటే, 2016లో బరిలోకి దిగినప్పటికీ, జకో వయసు 29 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ వయసులో ఫ్రెంచ్ టైటిల్ నెగ్గడం అత్యంత కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే జకోవిచ్ కెరీర్ స్లామ్ కల నెరవేరదేమో!

  • Loading...

More Telugu News