: చంద్రబాబును అరెస్ట్ చేసే దమ్మూ, ధైర్యం ఎవరికీ లేవు: పరకాల ప్రభాకర్
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసే దమ్మూ, ధైర్యం ఎవరికీ లేవని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడినట్లుగా కేసీఆర్ సర్కారు విడుదల చేసిన ఆడియో టేపులపై పరకాల వేగంగా స్పందించారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆడియో టేపులో ఉన్నది చంద్రబాబు స్వరం కాదు. సదరు స్వరం చంద్రబాబుదే అయినా... అప్పుడప్పుడు, అక్కడక్కడ చంద్రబాబు మాట్లాడిన మాటలను తప్పుడు అర్థం వచ్చేలా గుదిగుచ్చారు. కాదూ కూడదంటారా... ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేస్తున్నామని ఒప్పుకోండి’’ అని పరకాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆడియో టేపుల లోతు చూస్తాం... అంతూ చూస్తాం. ఇది ఏపీ సర్కారును అస్థిరపరిచే కుట్ర. మామూలుగా విడిచిపెట్టే విషయం కాదు. ఈ కేసులో సాక్ష్యాలన్నీ కోర్టుకు సమర్పించామంటున్నారు. మరి... కొత్తగా ఈ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి సాక్ష్యాధారాలు కావా? మా వద్ద టేపులున్నాయని సాక్షాత్తు తెలంగాణ హోం మంత్రి చెప్పారు. సీఎం, హోం మంత్రి, ఏసీబీ డీజీని సూటిగా అడుగుతున్నాం. ఈ టేపులు ఎక్కడివి? ట్యాపింగ్ చేశారా? చేసి ఉంటే ఆ విషయం ఒప్పుకోండి’’ అని ఆయన సవాల్ చేశారు.