: చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్... ఏపీ ఇంటెలిజెన్స్ లో భారీగా బదిలీలు
ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లను తెలంగాణ పోలీసులు ట్యాపింగ్ చేసిన వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పోలీసులు చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేశారని ఏపీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కు గురైతే దానిని ఎందుకు గుర్తించలేకపోయామనే అంశంపై ఏపీ ఇంటెలిజెన్స్ శాఖలో కలవరం మొదలైంది. సీఎం ఫోన్ ట్యాపింగ్ నే పసిగట్టలేని అధికారులు, ఇక ఏం పనిచేస్తారన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ విషయంపై దృష్టి సారించిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ విభాగం మొత్తాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలో ఆ శాఖలో కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ అన్ని పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్వసనీయ సమాచారం.