: రేవంత్ ‘కోడ్’ భాషపై ఏసీబీ ఆరా!
ఓటుకు నోటు కేసులో అరెస్టై ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణలో ప్రశ్నల పరంపరను ఎదుర్కొంటున్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. నిన్న రెండు గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు, రేవంత్ ను ఉద్దేశపూర్వకంగానే ఖాళీగా కూర్చోబెట్టి ఆయన సహనాన్ని పరీక్షించారు. తాజాగా నేటి ఉదయం సిట్ కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డిని తమ కార్యాలయానికి తరలించి, పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఏసీబీకి చిక్కిన ఆడియో టేపులో రేవంత్ రెడ్డి కోడ్ ల్యాంగ్వేజ్ ను వాడారట. ప్రస్తుతం ఆ ‘కోడ్ లాంగ్వేజ్’ గురించి ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అంతేకాక సదరు కోడ్ లాంగ్వేజ్ హవాలా తరహా లావాదేవీలు నిర్వహించేవారే వాడతారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఈ ఒక్క సందర్భంలోనే కాక పలు సందర్భాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. దీంతో కోడ్ లాంగ్వేజ్ ను తెలుసుకుంటే అసలు నేరం ఏ స్థాయిలో జరిగిందో కూడా తెలిసిపోతుందని ఏసీబీ బాసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.