: ఐఎస్ ను తుదముట్టించేందుకు యుద్ధరంగంలోకి దూకిన హాలీవుడ్ హిట్ చిత్రాల నటుడు
ఆల్ కైదా తర్వాత ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై ప్రత్యక్ష పోరు ప్రకటించాడు హాలీవుడ్ కు చెందిన ఓ నటుడు. ఐఎస్ తీవ్రవాదులను మట్టుబెట్టి తీరతానని అతడు ప్రకటించాడు. ఇంటికి ఎప్పటికీ రానని, రాలేనని కూడా అతడు తన కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పేశాడు. ప్రస్తుతం ఐఎస్ పై సిరియాలో పోరు సాగిస్తున్న కుర్దూ సైన్యంతో కలిసి అతడు కదనరంగంలోకి దూకిపోయాడు. వివరాల్లోకెళితే... పైరేట్స్ ఆఫ్ కరీబియన్, నైట్ అండ్ డే, ఓల్డ్ డాగ్స్ లాంటి హాలీవుడ్ హిట్ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన మైఖేల్ ఎన్ రైట్ కొద్దికాలం క్రితం ఇల్లు విడిచి వెళ్లాడు. నేరుగా సిరియా చేరి కుర్దూ సైన్యంతో కలిసి ఐఎస్ ఉగ్రవాదులపై యుద్ధం సాగిస్తున్నాడు. అయినా బంగారం లాంటి భవిష్యత్తును వదిలి ఈ పోరాటాలెందుకని అతడిని ప్రశ్నిస్తే, దానికి కూడా అతడు స్పష్టమైన సమాధానమే ఇస్తున్నాడు. గతంలో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్టును బందీగా పట్టుకున్న ఐఎస్ ఉగ్రవాదులు అతడిని అతి క్రూరంగా చంపేసి, సదరు వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన మైఖేల్, భూమి మీద ఇలాంటి వారు కూడా ఉంటారా? అని అనుకున్నాడట. మనుషుల్ని క్రూరంగా చంపి ఆనందించేవాళ్లకు భూమిపై బతికే హక్కు లేదని చెబుతున్న మైఖేల్, ఐఎస్ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకే తాను కదనరంగంలోకి దూకానని ఏమాత్రం తడుముకోకుండా చెబుతున్నాడు.