: సత్తిబాబు వెంట పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వస్తున్నారట!
ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గానే కాక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో కీలక మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ మరికాసేపట్లో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బొత్స పార్టీలో చేరనున్నారు. కుటుంబ సభ్యులు, భారీ అనుచర గణంతో వైసీపీలో చేరనున్న సత్తిబాబు, తన వెంట పలువురు మాజీ ఎమ్మెల్యేలను కూడా తీసుకొస్తున్నారట. నిన్నటిదాకా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన సత్తిబాబు, నేటి ఉదయం పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా తన వెంట వైసీపీలో చేరుతున్నారని మీడియాకు లీకులిచ్చారు. అయితే ‘ఆ పలువురు మాజీ ఎమ్మెల్యేలు’ ఎవరన్న విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. దీంతో సత్తిబాబు వెంట వైసీపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారన్న అంశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. మరికాసేపట్లోనే ఈ సస్పెన్స్ వీడనుంది.