: కుటుంబానికి భారమైతే...కారుణ్య మరణం తప్పదు: స్టీఫెన్ హాకింగ్ సంచలన ప్రకటన
భౌతిక శాస్త్రంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. తన కుటుంబానికి భారమైతే, కారుణ్య మరణాన్ని ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు. 21 వ ఏట మోటార్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్ఆర్) బారిన పడ్డ హాకింగ్, ఐదు దశాబ్దాలుగా వీల్ చైర్ కే పరిమితమయ్యారు. రెండేళ్ల కంటే ఎక్కువ బతకరని నాడు వైద్యులు చెప్పినా, ఆయన ఇప్పటికీ బతికే ఉండటం గమనార్హం. వీల్ చైర్ కు పరిమితమైనప్పటికీ, భౌతిక శాస్త్రంలో అవిశ్రాంత పరిశోధనలు చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన, ఆది నుంచి ‘రైట్ టూ డై’ ఉండాల్సిందేనని వాదిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ తరహా మరణం వరం లాంటిదని కూడా హాకింగ్ చెబుతున్నారు. తాజాగా తాను కారుణ్య మరణాన్ని ఆశ్రయిస్తానని ఆయన తేల్చిచెప్పేశారు. తన కుటుంబానికి భారంగా మారిన నాడు తప్పనిసరిగా కారుణ్య మరణం ద్వారానే ఈ లోకం విడిచివెళతానని హాకింగ్ ప్రకటించారు.