: తలసాని, తుమ్మల నివాసాలకు వెళ్లి కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలి: ఎర్రబెల్లి, రమణ డిమాండ్
తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజాకోర్టుకు తాము సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఆ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్, విమలక్క జడ్జిలని, వారేం చెబితే అదే తీర్పని అన్నారు. తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వారి నివాసాలకు వెళ్లి కేసీఆర్ ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకోవడాన్ని ఏమంటారో చెప్పాలని, అది ప్రలోభం కిందికి రాదా? అని ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అంటున్న కేసీఆర్ కు దమ్ముంటే చంద్రబాబు పాత్రపై ఆధారాలు బయటపెట్టాలని అన్నారు.