: భారత్ తో సిరీస్ సాధ్యం కాకపోతే 'ప్లాన్ బి' సిద్ధంగా ఉంది: పాక్ క్రికెట్ బోర్డు
భారత్, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా, రాజకీయ అంశాల ప్రతికూలత మాత్రం వెంటాడుతోంది. పాకిస్థాన్ తో క్రీడా సంబంధాలు వద్దని భారత్ లో పలు వర్గాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంతో ఆటలేంటని చాలామంది బహిరంగంగానే ఎలుగెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ తో ఈ ఏడాది చివర్లో క్రికెట్ సిరీస్ ఆడాలని పాక్ భావిస్తోంది. ఆ సిరీస్ కు ఇంకా ఆమోదముద్ర పడలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పందించారు. ఒకవేళ యూఏఈలో భారత్ తో ప్రతిపాదిత సిరీస్ సాధ్యం కాకపోతే తమ వద్ద 'ప్లాన్ బి' సిద్ధంగా ఉందని తెలిపారు. మరో జట్టుతో సిరీస్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. అంతకుమించి వివరాలు తెలపలేనని అన్నారు. భారత్ తో సిరీస్ విషయమై రెండు నెలల్లో స్పష్టత వస్తుందని ఖాన్ తెలిపారు. కిందటేడాది భారత్, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య ఆరు సిరీస్ లకు గాను ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా డిసెంబర్ లో యూఏఈలో సిరీస్ జరగాల్సి ఉంది.