: నేటి 'మందండం'లో ఆనాడు రుద్రమదేవి జన్మదిన వేడుకలు


మందడం... గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఓ చిన్న గ్రామం. ఇటీవలి కాలం వరకూ ఆ చుట్టు పక్కల వారికి తప్ప ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఊరు. కానీ, నేడు... ఆ గ్రామం పేరు చరిత్రలో నిలిచిపోనుంది. నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి భూమిపూజ జరిగిందక్కడే. అయితే, మందడం గ్రామం ఈనాటిది కాదు. కాకతీయ రాజుల కాలం నుంచి ఈ గ్రామం ఉంది. గణపతిదేవుడు, రాణీ రుద్రమదేవి ఈ ప్రాంతంలో తిరిగారు. రుద్రమదేవి జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ వైభవంగా జరిగాయని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రాంతంలో కృష్ణానది ఉత్తరవాహినిగా ఉండడం వల్లే కాకతీయుల పాలనలోనూ ఓ వెలుగు వెలిగిందని వాస్తు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. రాణి రుద్రమదేవి వేయించిన 14 అడుగుల ఎత్తైన 200 వాక్యాల శాసనం ఇప్పటికీ, మండదం శివారులోని సుగాలీ కాలనీ వద్ద దర్శనమిస్తుంది. 1261వ సంవత్సరంలో వేయించిన ఈ శాసనంపై ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవోగా ఉన్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అధ్యయనం ప్రకారం, విశ్వేశ్వరుని ఆలయాన్ని ఇక్కడ నిర్మించింది గణపతిదేవుడే. మందడంతో పాటు వెలగపూడి గ్రామాలను ఒక అగ్రహారంగా ప్రకటించి వాటిని విశ్వేశ్వర శివాచార్యుడికి దానమివ్వడంతో పాటు సంస్కృత కళాశాల, శైవులకు మఠం, ప్రసూతి ఆసుపత్రిని కూడా నిర్మించారు. రుద్రమదేవి ఏ సంవత్సరం పుట్టారో తెలియక పోయినా, ఆమె మార్చి 25న జన్మించారని కూడా ఈ శాసనంపై ఉన్న అక్షరాలను బట్టి వెల్లడైందని ఈమని వివరించారు. రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుల సమక్షంలో మందడంలోనే ఆమె జన్మదిన వేడుకలు వైభవంగా జరిగినట్టు ఉందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు. శతాబ్దాల క్రితమే ఇంతటి విశిష్టత సంతరించుకున్న మందడం కేంద్రంగా ఇప్పుడు అమరావతి రానుండడం తెలుగు ప్రజల అదృష్టమే.

  • Loading...

More Telugu News