: మోదీ కంటే ఓ అడుగు ముందున్న మమతా బెనర్జీ
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభం కావడానికన్నా ముందే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢాకాలో అడుగుపెట్టారు. వాస్తవానికి వీరిద్దరూ కలిసి బంగ్లాదేశ్ పర్యటనలో పాల్గొంటారని భావించినప్పటికీ, దీదీ ముందుగానే వెళ్లడంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. నిన్న రాత్రి ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఆ దేశ విదేశాంగ మంత్రి షహరియార్ ఆలం స్వాగతం పలికారు. ఇదిలావుండగా, మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బంగ్లా ప్రభుత్వం స్వయంగా ఏర్పాట్లు చేసింది. ఢాకా నగర వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మోదీ, మమతా బెనర్జీ, బంగ్లా ప్రధాని హసీనాల నిలువెత్తు కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాని రెండు రోజుల పాటు బంగ్లాదేశ్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు పెట్టనున్నాయి. కోల్‌కతా-ఢాకా-అగర్తల, ఢాకా-షిల్లాంగ్-గౌహతి బస్సు సర్వీసులను మోదీ, హసీనాలు ప్రారంభిస్తారు.