: మ్యాగీ దెబ్బకు నెస్లే 'షేర్' కుదేలు... రూ. 10 వేల కోట్ల నష్టం
మ్యాగీ వ్యవహారం నెస్లేపై కోలుకోలేని దెబ్బ తీసింది. సంస్థ మార్కెట్ కాప్ ఏకంగా రూ. 10 వేల కోట్ల మేరకు దిగజారింది. దేశవ్యాప్తంగా మ్యాగీ సరుకును వెనక్కు తీసుకుంటున్నామని నెస్లే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉదయం స్టాక్ మార్కెట్లో మరో 5 శాతం మేరకు ఆ సంస్థ ఈక్విటీ పతనమైంది. నెస్లే మొత్తం ఆదాయంలో 20 శాతం వరకూ మ్యాగీ అమ్మకాల నుంచే వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంవత్సరం మార్చి 10వ తేదీన రూ. 7,505 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిలో ఉన్న ఈక్విటీ ధర, నిన్న ఏకంగా రూ. 4,761కి పడిపోయింది. ఈ నేపథ్యంలో నెస్లేకు ఉన్న బ్రాండ్ వాల్యూను దృష్టిలో ఉంచుకుని కనిష్ఠ స్థాయిల వద్ద ఈక్విటీల కొనుగోళ్లు కూడా జరుగుతున్నట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద గడచిన ఐదు సెషన్ల వ్యవధిలో నెస్లే మార్కెట్ కాప్ రూ. 10 వేల కోట్ల వరకూ నష్టపోయింది. రోజుల వ్యవధిలో 15 శాతానికి పైగా దిగజారిన షేరు విలువలో కొంత కరెక్షన్ కు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.