: ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ శిక్కాను టార్గెట్ చేసుకున్న హౌసింగ్ డాట్ కాం సీఈఓ రాహుల్ యాదవ్
హౌసింగ్ డాట్ కాంలో తన వాటానంతటినీ ఉద్యోగులకు రాసిచ్చేసి వార్తల్లోకెక్కిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ తాజాగా, ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ శిక్కాను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక విమానాశ్రయంలో విశాల్ నిద్రిస్తున్న ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన రాహుల్, ఆయన... తనతో మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. "ఇన్ఫోసిస్ సీఈఓ శిక్కాను నేనేదో అడగబోతే, 'నాకు నిద్రపోవాలని మాత్రమే ఉంది' అంటూ, కనీసం నా ప్రశ్న కూడా వినలేదు" అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో రాహుల్ ఇలా ఇతర పారిశ్రామిక వేత్తలు, సీనియర్ మేనేజ్ మెంటు స్థాయి ఉద్యోగులపై వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఐఐటీ బాంబే నుంచి చదువును మధ్యలోనే ఆపేసిన ఆయన హౌసింగ్ డాట్ కాం స్థాపించారు. తనలాగే సంపదను, వాటాలను దానం చెయ్యాలని కోరుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు విమర్శలను ఎదుర్కొన్నారు.