: తిరుపతి లడ్డూను పరీక్షించగలరా?... రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్!
మ్యాగీ నూడిల్స్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగీపై నిషేధం విధించగా, నేటి ఉదయం తెలంగాణ ప్రభుత్వం కూడా వేటు వేసింది. సీసం వంటి హానికర రసాయనమున్న మ్యాగీ నూడిల్స్ ఆరోగ్యానికి తీరని హానీ చేస్తుందన్న వార్తలతో దాని విక్రయాలు పడిపోయాయి. దానిని తయారు చేస్తున్న నెస్లే కంపెనీ షేరు ధర పతనమైంది. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మ్యాగీకి మద్దతు పలికారు. వివాదం మొదలైన తర్వాత మరింత ఎక్కువగా మ్యాగీ తింటున్నానని ఆయన ట్వీట్ చేశారు. అంతటితో ఆగని ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామి పవిత్ర ప్రసాదం తిరుపతి లడ్డూను పరీక్షించగలరా? అంటూ ప్రశ్నించి సంచలనం రేపారు. రోడ్డు పక్కగా ఉన్న వంద హోటళ్లను తనిఖీ చేయగలరా? అని కూడా ఆయన ప్రశ్నించారు. క్యూట్ గానే కాక టేస్టీగా ఉండే ‘మ్యాగీ’ వివాదం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఏదేమైనా, మ్యాగీ నూడిల్స్ ఈ వివాదం నుంచి బయటపడుతుందని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యాగీ నూడిల్స్ మాదిరే క్యాడ్ బరీ, అమూల్, కోల్ గేట్ లనూ పరీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 'ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతారు. మ్యాగీపై నిషేధం విధించారు. సూపర్బ్' అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్స్ సంధించారు. వ్యతిరేక ప్రచారంతో మ్యాగీ నూడిల్స్ ఇప్పుడు సులభంగా దొరుకుతున్నాయని వర్మ చమత్కరించారు.