: రాజ్యసభ టీవీ... రూ. 1700 కోట్ల మిస్టరీ!
ఓ న్యూస్ చానల్ పెట్టాలంటే ఎంత ఖర్చవుతుంది? ప్రారంభంలో రూ. 50 నుంచి రూ. 60 కోట్లు, ఒక సంవత్సరం నిర్వహణ నిమిత్తం మరో రూ. 25 నుంచి రూ. 30 కోట్లు (డిస్ట్రిబ్యూషన్ హక్కులు మినహా) అవసరమవుతాయి. ఎన్ని భాషల్లో చానల్ ప్రసారాలు ఉంటాయి? డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు ఎంత? అన్న విషయాలపై ఆధారపడి ఖర్చులు పెరుగుతాయి. ఈ మాటలు చెబుతున్నది మలయాళ మనోరమ, సాక్షి తదితర టీవీ చానళ్ల ప్రారంభంలో సహాయపడ్డ మీడియాగురూ కన్సల్టెంట్స్ ఎండీ సంజయ్ సలిల్. 2010-11లో రాజ్యసభ ప్రసారాలను ప్రజలకు అందించే నిమిత్తం మొదలైన ప్రత్యేక టీవీ చానల్ ప్రారంభానికి రూ. 206 కోట్లు ఖర్చయినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపై ఐదేళ్ల కాల పరిధిలో రాజ్యసభ టీవీ రూ. 1,700 కోట్ల రూపాయలను చానల్ నిర్వహణకు ఖర్చు చేసినట్టు వెల్లడి కావడం, చానల్ లో జరుగుతున్న అవినీతిని కళ్లకు కడుతోంది. గత సంవత్సరం న్యాయవాది ప్రశాంత్ భూషన్ రాజ్యసభ టీవీ నిర్వహణ, కార్యదర్శి నియామకం తదితర విషయాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేయగా, 14 పార్టీలు ఆయన్ను తీవ్రంగా విమర్శించాయి. పెద్దల సభ గౌరవాన్ని ఆయన మంటగలుపుతున్నారని నోటీసులు కూడా ఇచ్చాయి. ఆర్ఎస్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురుదీప్ సింగ్ ఆడిట్ చేసిన గణాంకాల ప్రకారం మొత్తం డబ్బులో సుమారు రూ. 1000 కోట్లు ఖర్చుచేసిన విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సహా 67 చానల్స్ నిర్వహిస్తున్న ప్రసార భారతికి 2013-14 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేటాయించినది రూ. 2,140 కోట్లు. ప్రసార భారతిలో 33 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాజ్యసభ కార్యదర్శి నేతృత్వంలో సాగుతున్న ఆర్ఎస్ టీవీలో ఉద్యోగుల సంఖ్య 250 మాత్రమే. రాజ్యసభ టీవీ చానల్ ఖర్చుల విషయంలో కార్యదర్శి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కాగ్ సైతం అభిప్రాయపడ్డ నేపథ్యంలో, ఆర్ఎస్ టీవీలో జరుగుతున్న అవినీతిపై రెండు వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలతో గళం విప్పాయి. ఇంత ఖర్చుపెట్టినప్పటికీ ఆర్ఎస్ టీవీకి ఆదాయం మాత్రం లేదట. టీవీ చానల్ ను ఎవరు చూసినా చూడకున్నా, వ్యాపార ప్రకటనలు మాత్రం తీసుకోరాదని రాజ్యసభ పెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రూ. 1,700 కోట్ల ఖర్చు ఎలా జరిగిందన్న విషయంపై వారేమంటారో వేచిచూడాల్సి వుంది.