: రతన్ టాటాను మెప్పించిన ఫ్యాషన్ పోర్టల్... భారీ పెట్టుబడిపెట్టిన పారిశ్రామిక దిగ్గజం
టాటా సన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత అగ్రశ్రేణి వెంచర్ క్యాపిటలిస్టుగా మారిన రతన్ టాటా, ఇప్పటికే పలు ఈ-కామర్స్ వెబ్ సైట్లు, స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యాషన్ పోర్టల్ 'కార్యాహ్'లో భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎంత పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని వెల్లడించకపోయినప్పటికీ, ఆ పెట్టుబడి సంస్థ ఉన్నతికి సహకరిస్తుందని కార్యాహ్ డాట్ కాం ప్రతినిధి అగర్వాల్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వెస్ట్రన్ వేర్ ను ఆన్ లైన్లో మార్కెటింగ్ చేస్తున్న కంపెనీల్లో తాము ముందున్నామని, మిగతా కంపెనీలు 12-13 సైజులు అందిస్తుంటే, తాము 18 రకాల సైజులను అందిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, రతన్ టాటా ఇప్పటికే, స్నాప్ డీల్, అర్బన్ లాడర్, బ్లూస్టోన్, కార్ దేఖో డాట్ కాం, పేటీఎం, జియోమీ తదితర కంపెనీల్లో తన స్వీయ సంపాదనను పెట్టుబడులుగా పెట్టిన సంగతి తెలిసిందే.