: యూఎస్ లో ఢిల్లీ యువకుడి మరణంపై తండ్రి ఆవేదన... న్యూయార్క్ టైమ్స్ లో ప్రస్తావన
ఆర్థిక రంగంలో పని ఒత్తిడి ఎంతగా ఉంటుందో ఆ విభాగంలో పనిచేసే వాళ్లకు తెలుస్తుంది. కాస్తంత పని తెలుసు అని భావిస్తే, సదరు ఉద్యోగిపై ఎంతో పని భారం పడుతుంది. ఇక బాగా చేస్తాడని అనుకుంటే... నిద్ర పొయేందుకు కూడా సమయం ఉండదు. ఇటువంటి పని ఒత్తిడిని తట్టుకోలేకనే సర్వశ్రేష్ఠ్ గుప్తా అనే 22 ఏళ్ల గోల్డ్ మన్ సాక్స్ ఉద్యోగి తనువు చాలించాడు. న్యూఢిల్లీలో పుట్టి యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో విద్యను అభ్యసించి, క్రెడిట్ సూస్, డ్యూటస్చ్ బ్యాంకుల్లో ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని ఏప్రిల్ 16న తన అపార్టుమెంటు పార్కింగ్ స్థలంలో విగతజీవిగా కనిపించాడు. రోజుకు 20 గంటలు పనిచేయాల్సి వస్తోందని, ఇంత కష్టం చెయ్యలేకపోతున్నానని అంతకుముందు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. సర్వశ్రేష్ఠ్ మరణంపై గోల్డ్ మన్ సాక్స్ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. ఆర్థిక రంగంలోని ఉద్యోగులపై పడుతున్న ఒత్తిడిని ప్రస్తావిస్తూ అతని తండ్రి ఓ పోస్టు పెట్టగా, దానిపై వాల్ స్ట్రీట్ లో పెద్ద చర్చే జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ సర్వశ్రేష్ఠ్ పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "సర్వశ్రేష్ఠ్ అంటే హిందీలో అత్యుత్తమం అని అర్థం. అతను పేరుకు తగ్గట్టే ప్రవర్తించాడు. సహచర ఉద్యోగులు అతన్ని ఎంతో ఇష్టపడేవారు. ఆర్థిక విశ్లేషణలు చేయడంలో దిట్ట. ఎంతో ఉత్తమమైన పనితీరును కనబరుస్తున్నందునే అతనిపై పని ఒత్తిడి పెరిగింది. అదే అతని పాలిట శాపమైంది" అని పేర్కొంది. ఏప్రిల్ 16న తన మరణానికి ముందు తండ్రికి కాల్ చేసి "ఇట్ ఈజ్ టూ మచ్. నేను రెండు రోజుల నుంచి నిద్రపోలేదు. రేపు ఉదయాన్నే క్లయింటుతో సమావేశం ఉంది. ప్రజంటేషన్ ఇవ్వాలి. మా వైస్ ప్రెసిడెంట్ నన్ను పనిపై వదిలేసి వెళ్లిపోయాడు" అని చెప్పాడు. వారాంతాలు కూడా పనిచెయ్యాల్సి వస్తోందని చెప్పిన సర్వశ్రేష్ఠ్, ఉద్యోగం మానేసి వచ్చి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తమ పాఠశాలను అభివృద్ధి చేస్తానని తండ్రితో అన్నాడట. అంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆ తండ్రి పడుతున్న రోదన తీర్చేదెవరు?