: రేవంత్ రెడ్డికి ఐటీ సెగ
టీడీపీ ఎమ్మల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు వ్యవహారంలో ఐటీ విభాగం (ఆదాయపు పన్ను శాఖ) సెగ కూడా తగలనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టారని ఏసీబీ ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఇప్పుడు ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. రేవంత్ తో పాటు ఈ కేసులో నిందితులు సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహను కూడా విచారించేందుకు అవకాశం కల్పించాలని ఐటీ అధికారులు కోర్టును కోరనున్నారు. కాగా, ఈ కేసులో నిందితులను విచారించేందుకు వీలుగా నిందితులను కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఆ తర్వాత ఐటీ విభాగం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.