: అనారోగ్యం పాల్జేస్తున్న 'డేటింగ్' సైట్లు
మీ 'అభిరుచి'కి తగిన జోడీని వెతుక్కోండి... రండి! అంటూ ఆన్ లైన్ డేటింగ్ సైట్లు వల విసురుతుంటాయి. అలాంటి సైట్లలో అత్యధికం మోసపూరితమైనవే. అనుభవం మీద అత్యధికులు తెలుసుకునే విషయమిది. ఈ సైట్లు జేబుకు చిల్లు పెట్టడం అటుంచితే, ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. పరస్పర అంగీకారంతో శృంగారానికి వీలు కల్పించే ఈ సైట్లు, తద్వారా హెచ్ఐవీ, ఇతర సుఖవ్యాధుల కారక వైరస్ లను వ్యాపింపజేస్తున్నాయని అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ రీతూ అగర్వాల్ (రాబర్ట్ హెచ్ స్మిత్ బిజినెస్ స్కూల్) చెబుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరిడాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగుదలకు క్రెయిగ్ లిస్ట్ అనే అడల్ట్ డేటింగ్ సైటే కారణమని అధ్యయనం చెబుతోంది. ఈ సైట్ లో కలిసిన భాగస్వాముల ద్వారానే అత్యధికులకు హెచ్ఐవీ సోకినట్టు వెల్లడైందట. హెచ్ఐవీ నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, ఇలాంటి సైట్లు మొత్తం వ్యవహారాన్ని మార్చేయవచ్చని, ప్రజారోగ్య విభాగం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ సూచించారు.