: కోర్టు హాల్లో ఏకే 47 కాల్పులు... కరుడు గట్టిన ముఠానేత సహా ముగ్గురు మృతి
కోర్టులో ఓ కేసు విచారణ జరుగుతోంది. ఉన్నట్టుండి ఇద్దరు దుండగులు ఏకే 47 తుపాకులు చేతబట్టి కోర్టు హాల్లోకి ప్రవేశించారు. వచ్చీరాగానే కాల్పులకు తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 30 రౌండ్ల తూటాలు తుపాకుల నుంచి దూసుకొచ్చాయి. ఈ కాల్పుల్లో కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడితో పాటు అతడి ఇద్దరు సన్నిహితులు అక్కడికక్కడే మృతి చెందారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో నిన్న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళితే... అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ముఠా నాయకుడు సుశీల్ శ్రీవాస్తవ ఐదేళ్లుగా విచారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నాడు. నిన్న విచారణ నిమిత్తం హజారీబాగ్ లోని ఓ కోర్టులో పోలీసులు అతడిని హాజరుపరిచారు. విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తుపాకులు చేతబట్టి కోర్టు హాల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో శ్రీవాస్తవతో పాటు అతడి ఇద్దరు సహచరులు చనిపోయారు.