: నెస్లే పాలపొడిలో పురుగులు!
ఇప్పటికే మ్యాగీలో హానికారక రసాయనాలున్నాయన్న ఆరోపణల నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచనలో తలమునకలైవున్న 'నెస్లే' సంస్థకు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో అనంత్ అనే ఓ ట్యాక్సీ డ్రైవర్, నెస్లే మార్కెటింగ్ చేస్తున్న 'నాన్ ప్రో 3' పాల పొడిని కొన్నాడు. అందులో లార్వాతో పాటు, సాధారణంగా బియ్యంలో కనిపించే పురుగులు కూడా ఉన్నాయి. మొత్తం 28 లార్వా, 22 పురుగులు ఆ పాలపొడి డబ్బాలో బయటపడ్డాయి. దీంతో అది సురక్షితమైనది కాదని తమిళనాడు ఆహార భద్రతా విభాగం ప్రకటించింది. 18 నెలల వయసున్న తన కవల పిల్లల్లో ఒకరికి అనంత్ ఆ పాలపొడితో పాలు కలిపి ఇచ్చాడు. ఆపై రెండు రోజుల తరువాత చర్మం మీద ఎలర్జీ రావడంతో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంత్ నెస్లే కస్టమర్ సపోర్ట్ నెంబరుకు ఫిర్యాదు చేయగా, వాళ్లు వచ్చి మరో ప్యాక్ ఇస్తామని, దాన్ని తిరిగి ఇస్తే కంపెనీ ల్యాబ్ లో పరీక్షిస్తామని చెప్పారు. అందుకు అంగీకరించని బాధితుడు తమిళనాడు ఎఫ్డీఏ విభాగాన్ని ఆశ్రయించాడు. వారు శాంపిళ్లను పరీక్షించి నెస్లేపై కేసుకు సిఫార్సు చేసినట్టు సమాచారం.