: కోడి గుడ్లపై నిషేధం విధించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
స్వతహాగా శాకాహారి అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోడి గుడ్ల వాడకంపై నిషేధాన్ని విధించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకూ పోషకాహారాన్ని అందించే అంగన్ వాడీ కేంద్రాలలో కోడి గుడ్డును, గుడ్డు కూరను నిషేధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తమ సెంటిమెంటును గౌరవించినందుకు రాష్ట్రంలోని జైన మతస్తులు మాత్రం చౌహాన్ ను అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాలైన మాండ్లా, అలిరాజ్ పూర్, హోషంగాబాద్ లలో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు, మహిళలకు పౌష్టికాహారం కోసం కోసం ఉడికించిన గుడ్లను, ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్) స్కీములో భాగంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్న పలు సంఘాలు తీవ్ర నిరసన తెలపడంతో శివరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గుడ్ల స్థానంలో కూరగాయలు, పండ్లు, పాలు ఇవ్వాలని జైన మహాసమితి ప్రతినిధి అనిల్ బద్కుల్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సీఎం నిర్ణయం ఏకపక్షంగా ఉందని, ఆయన ఒక శక్తిమంతమైన లాబీయింగ్ తో ప్రభావితం అయ్యారని వివిధ సంఘాలు ఆరోపిస్తున్నాయి.