: కరుణించిన రిజర్వ్ బ్యాంకు... చెలామణిలోకి రూ. 50 వేల కోట్లు... తగ్గనున్న వడ్డీల భారం


బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నెలవారీ కిస్తీలు చెల్లిస్తున్న వారికి శుభవార్త. పరపతి సమీక్షలో భాగంగా రెపో రేటు (రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకునే నగదుపై వసూలు చేసే వడ్డీ రేటు)ను 0.25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు. ఈ ఉదయం పరపతి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 7.50 శాతంగా ఉన్న రెపో రేటును 7.25 శాతానికి తగ్గిస్తున్నామని, ఈ మేరకు లబ్ధిని తక్షణమే కస్టమర్లకు అందించేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రివర్స్ రెపో రేటు (బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులో దాచుకునే నగదుపై లభించే వడ్డీ)ని 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆయన తెలిపారు. మిగతా రేట్లన్నీ యథాతథంగా కొనసాగుతాయని ఆయన వివరించారు. రెపో రేటు తగ్గడం మూలంగా వ్యవస్థలోకి సుమారు రూ. 50 వేల కోట్లు చెలామణిలోకి రానున్నాయి. కాగా, ఈ సంవత్సరంలో రెపో రేటు తగ్గడం ఇది మూడోసారి. ఆర్బీఐ నిర్ణయంతో కొత్తగా తీసుకునే రుణాలతో పాటు పాత రుణాలపైనా వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో బ్యాంకుల్లో వేసే ఫిక్సెడ్ డిపాజిట్లపైనా వడ్డీ తగ్గనుంది.

  • Loading...

More Telugu News