: టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలోగానే... తామే ఆ పని కానిచ్చేయాలనుకుంటున్న టీడీపీ?
'నోటుకు ఓటు' వ్యవహారంలో పూర్తి ఆధారాలతో పట్టుబడి రిమాండ్ కు వెళ్లిన తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ పలు విధాలుగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉంది. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కున్న కొందరు ఎంపీల పదవులను పార్లమెంటు రద్దు చేసింది. ఇప్పుడు, రేవంత్ వ్యవహారంలో అదే విధంగా వ్యవహరించాలని, శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయకముందే... రేవంత్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, ఉపఎన్నిక బరిలో దింపాలని టీడీపీ ఎత్తు వేస్తున్నట్టు సమాచారం. ఉపఎన్నికలో రేవంత్ మళ్లీ గెలిస్తే... టీడీపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో, ఇరు పార్టీలు ఎత్తులు, పైఎత్తులు ఎలా వేస్తాయో వేచి చూడాల్సి ఉంది.