: అంతుచిక్కని ఉపగ్రహం పనితీరు


కాలం తీరినా.. పనిచేయడం మాత్రం మాననంటోంది ఓ ఉపగ్రహం. కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు రూపొందించిన జుగ్ను అనే ఉపగ్రహాన్ని 2011 అక్టోబర్ 12న అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఆ ఉపగ్రహం జీవితకాలం ఏడాది మాత్రమే. అందుకే, ఏడాది తరువాత దానిని పరిశీలించడం మానేశారు. అయితే విచిత్రంగా ఏడాది తరువాత కూడా ఇటీవల ఆ ఉపగ్రహం నుంచి సంకేతాలు వస్తున్నాయని ప్రాజెక్టు ప్రధాన సమన్వయకర్త ఎన్ఎస్ వ్యాస్ తెలిపారు. ఉపగ్రహం లోపల పనితీరు కొంత బలహీనపడినా, దాన్నుంచి అందే సంకేతాలు మాత్రం భేషుగ్గా ఉన్నాయట.

ఈ విషయాన్ని బెంగళూరులోని నిట్టె అమెచ్యూర్ శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ గుర్తించింది. ఈనెల 9వ తేదీ ఉదయం 11.33 గంటలకు తమకు ఉన్నట్టుండి కొన్ని సంకేతాలు అందాయనీ, తీరా చూస్తే అవి ఎప్పుడో కాలం తీరిపోయిందనుకున్న జుగ్ను నుంచి వచ్చాయనీ తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామని శాటిలైట్ ట్రాకింగ్ కేంద్రం సమన్వయకర్త శంకర్ దాసిగ తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు ప్రతిరోజూ జుగ్ను నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు. దాంతో దాసిగ బృందం వెంటనే ఇస్రో వర్గాలతోపాటు ఐఐటీ కాన్పూర్‌ ఆచార్యులను కూడా అప్రమత్తం చేసింది.

  • Loading...

More Telugu News