: ఏ టూ జడ్ అన్నీ ఆ సీట్లోనే... ఆరు రోజుల నాన్ స్టాప్ ప్రయాణానికి కదిలిన విమానం!
ఆరు రోజుల నాన్ స్టాప్ ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ప్రయాణించాల్సిన దూరం... 8 వేల కిలోమీటర్లు; వేగం... గంటకు కేవలం 100 కి.మీ.; ప్రయాణ సమయం ఆరు రోజులు. తిండి, నిద్ర, కాలకృత్యాలు అన్నీ పైలట్ సీటులోనే, లేచి నిలిచేందుకు, అటూ ఇటూ తిరిగేందుకూ వీలుండదు. ఇక నిద్ర విషయం అంటారా? ఎప్పుడు నిద్రపోయినా, 20 నిమిషాల్లోపే లేవాలి. ఇదీ చైనా నుంచి హవాయికి పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఏకధాటిగా ప్రయాణం మొదలుపెట్టిన ‘సోలార్ ఇంపల్స్-2’లో పైలట్ ఆండ్రీ బోర్స్ బర్గ్ (62) ఒంటరిగా మొదలుపెట్టిన సాహసయానం. మధ్యలో ఏదైనా జరిగితే, ఇక అంతే సంగతులు! గడచిన మార్చి 9న అబూదాబీ నుంచి బయలుదేరిన ఈ విమానం, భారత్ మీదుగా చైనాకు గత నెలలోనే చేరింది. వాస్తవానికి మే 5నే చైనా నుంచి బయలు దేరాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక, నెల రోజులు వాయిదా పడింది. మరో వారం పాటు పసిఫిక్ లో ఎటువంటి వాతావరణ మార్పులు ఉండవని వాతావరణ శాఖ స్పష్టం చేసిన సందర్భంగా చైనాలోని నాంజింగ్ విమానాశ్రయం నుంచి సోలార్ ఇంపల్స్ బయలుదేరింది.