: అప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెట్టి... ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు!


విలాసాల్లో తేలియాడేందుకు కూర్చున్న చెట్టునే నరుక్కున్నాడో ఉద్యోగి. ఫలితంగా కటకటాలపాలయ్యాడు. లండన్ లోని ప్రముఖ కార్ల కంపెనీ జాక్వర్ ల్యాండ్ రోవర్ లో సిమోన్ వెన్ స్లీ అనే ఉద్యోగి దుర్బుద్ధి బట్టబయలైంది. ల్యాండ్ రోవర్ కంపెనీ ఉన్నతాధికారుల సంతకాలను వందల సంఖ్యలో ఫోర్జరీ చేసి దొంగ ఆర్డర్ కాపీలను తయారు చేసేవాడు. వాటిని కోవెంట్రీ ప్రాంతంలో ఉన్న ఆ సంస్థకు చెందిన గోడౌన్ కార్మికులకు చూపించేవాడు. దీంతో వారు ఆర్డర్ కాపీలో పేర్కొన్న విడిభాగాలను అతనికి అందజేసేవారు. వాటిని అతను స్థానికంగా ఉండే గ్యారేజ్ లలో సరసమైన ధరకు అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. ఒకసారి, రెండు సార్లు చేసి ఉంటే అలా దొరికి ఉండేవాడు కాదేమో, అది వ్యసనంగా మారడంతో గత 20 ఏళ్లుగా ఈ దందా చేస్తున్నాడు. ఇలా అతను 20 కోట్ల రూపాయల విలువ చేసే విడిభాగాలు దొంగతనం చేశాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి విలాసవంతమైన జీవితం గడిపాడు. అతని బండారం బయటపడటంతో పోలీసులకు దొరికిపోయాడు. అతని దొంగతనాలు రుజువు కావడంతో, న్యాయస్థానం అతనికి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. చక్కగా ఉద్యోగం చేసుకోకుండా, తిన్న ఇంటి వాసాలు లెక్కించిన సీమోన్ తీరిగ్గా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

  • Loading...

More Telugu News