: బూమ్ టైమ్!... ఆరు లక్షల కొత్త ఉద్యోగాలు, 20 శాతం పెరగనున్న వేతనాలు


ఈ-కామర్స్ రంగంలో వచ్చిన బూమ్ తో ఈ ఏడాది కొత్త కొలువుల పంట పండనుంది. కనీసం 6 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని, వేతనాల్లో 20 శాతానికి పైగా పెరుగుదల నమోదు కానుందని ప్లేస్ మెంట్ కంపెనీలు అంచనాలు వేస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంలో భాగంగా కార్పొరేట్ కంపెనీలు మానవ వనరుల సేవలందిస్తున్న సంస్థల చుట్టూ తిరుగుతున్నాయి. గత సంవత్సరం తాము 85 వేల మందికి ప్లేస్ మెంట్ చూపించినట్టు ఇండియా స్టాఫింగ్ ఫెడరేషన్ చైర్ పర్సన్, టీమ్-లీజ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణా చక్రవర్తి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 16 వేల మందికి ఉపాధి చూపినట్టు తెలిపారు. ఈ-కామర్స్ విభాగంతో పాటు రిటైల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో కొత్త ఉద్యోగుల కోసం డిమాండ్ అధికంగా ఉంటోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు రూ. 10,500 వేతనముండగా, సీనియర్ పోస్టులకు నెలకు రూ. 2 లక్షల వరకూ ఆఫర్ వస్తోందని తెలిపారు. ఇండియాలో గడచిన దశాబ్ద కాలంలో వివిధ రంగాల్లో 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2014లో మాత్రం టెంపరరీ ఉద్యోగాల వృద్ధి 8 శాతానికి మాత్రమే పరిమితమైంది. తిరిగి ఈ సంవత్సరం గణనీయంగా పుంజుకుంది. తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్ సమీప భవిష్యత్తులో 25 నుంచి 30 శాతం పెరగనుందని హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్ స్టాడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మూర్తి కే ఉప్పలూరి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఎంపికయ్యేవారికి మంచి వేతన ఆఫర్లు రానున్నాయని మాన్ పవర్ గ్రూప్ ఇండియా ఈడీ శ్రీకాంత్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News