: తేడా వస్తే అసెంబ్లీని రద్దు చేస్తానని హెచ్చరించిన కేసీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అసెంబ్లీని రద్దు చేసేందుకైనా వెనుకాడనని మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు హెచ్చరించారు. పార్టీ నిర్దేశించిన ప్రకారం ఓట్లు వేస్తే, ఐదు ఎమ్మెల్సీ సీట్లను మనమే గెలుస్తామన్న ఆయన, తొలి బాధ్యత మంత్రులదేనని, ఐదో సీటు గెలవకపోతే వారి పదవులు ఊడిపోతాయని అన్నారు. గెలుస్తామన్న నమ్మకంతోనే ఐదో అభ్యర్థిని నిలబెట్టామని, తెలంగాణలో మిగిలే రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, ఎంఐఎంలేనని ఆయన అంచనా వేశారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ప్రసంగించిన ఆయన ఏడాది పాలనలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చివరికి టీఆర్ఎస్ గూటికి చేరాల్సిందేనని, త్వరలో టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.