: మహానాడులో రూ.12 కోట్ల విరాళం వచ్చింది: చంద్రబాబు
మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన మహానాడులో టీడీపీకి రూ.12 కోట్ల విరాళం వచ్చినట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మహనాడు ముగింపు రోజు జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా బాబు ప్రసంగిస్తున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల జీవితాలను బాగు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏడాదికి 5వేల మంది కార్యకర్తలు, వారి పిల్లలకు ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. కార్యకర్తలను ఆదుకునే దీక్షలో అందరూ పాల్గొనాలని, పార్టీ కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలకు జీవితాంతం తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ, అనుబంధ సంస్థలను పటిష్ఠం చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఏడాదిలోపు అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలకు భవనాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ వ్యవస్థాపక నేత దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేద్దామని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు హితవు పలికారు. మహానాడు తీర్మానాలపై అన్ని స్థాయుల్లో చర్చలు జరగాలన్నారు.