: టీడీపీ జాతీయ పార్టీగా మారినా... సైకిల్ గుర్తు మారదు: యనమల


తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ కృషి చేస్తోంది. టీడీపీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడానికి రాజకీయం తీర్మానం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు మహానాడులో ప్రసంగించిన ఆయన, కనీసం నాలుగు రాష్ట్రాల్లో పార్టీ నమోదై ఉంటే జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీని విస్తరిస్తామన్నారు. ఇటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉందని యనమల ఉద్ఘాటించారు. టీడీపీ జాతీయ పార్టీగా మారినా... సైకిల్ గుర్తు మారదన్నారు. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు బలంగా ఉండాలన్నదే టీడీపీ సిద్ధాంతమని, సమాఖ్య స్పూర్తిని తెలుగుదేశం గౌరవిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా జాతీయస్థాయిలో టీడీపీకు గుర్తింపు ఉందన్నారు. నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసింది టీడీపీయే అని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ను గద్దె దించడానికి తాము కృషి చేశామని, ఎప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉంటామని యనమల స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రంతో సయోధ్య అవసరమన్న మంత్రి, ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడుగుతున్నట్టు తెలిపారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేయదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉనికిని కాపాడుకునేందుకు విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News