: ఫేస్ బుక్ ద్వారా ఆకర్షించి నిలువు దోపిడీ చేసిన మాయ'లేడి'!
సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోవడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఫేస్ బుక్ లో ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ ఓ మహిళ పలువుర్ని మోసం చేయడమే కాకుండా పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జయపురలో ఓ 26 ఏళ్ల యువతి ఫేస్ బుక్ లో ఖుష్బూ, శృతి శర్మ, లేడీ కోకోవా పేరిట ఐఏఎస్ ఆఫీసర్ నంటూ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. వీటి ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకుని, టీ కోసం వారిని ఇంటికి ఆహ్వానించేది. ఆమె మాటలు నిజమనుకుని ఆమె ఇంటికి వెళ్లిన వారిని నిలువు దోపిడీ చేసేది. ఎవరైనా ఎదురు తిరిగితే అత్యాచార యత్నం చేశారంటూ కేసుపెడతానని బెదిరించేది. దీంతో ఆమెపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకాడేవారు. దీనిని ఆసరాగా చేసుకుని ఆమె దాదాపు వంద మందిని లూటీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం వల పన్నిన పోలీసులను కూడా ఆమె ముప్పుతిప్పలు పెట్టిందని సమాచారం. ఎట్టకేలకు అజ్మీర్ రోడ్డులో కారు దొంగిలించి పారిపోతుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు. వారిప్పుడు సోషల్ మీడియాలో ఆమె అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారు.