: సైనా... చైనా గోడను అధిగమించలేకపోయింది!
వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి నిష్క్రమించింది. చైనా క్రీడాకారిణులపై స్పష్టమైన ఆధిక్యం కనబరచలేకపోతున్న సైనా మరోమారు తన బలహీనతలను బయటపెట్టుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సైనా 15-21, 13-21తో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ చేతిలో పరాజయంపాలైంది. డిఫెండింగ్ చాంప్ హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన సైనా నేటి మ్యాచ్ లో మాత్రం స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమైంది. ఇక, సైనా ఓటమితో టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసింది. పీవీ సింధు, జ్వాల-పొన్నప్ప, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గురు సాయిదత్ టోర్నీ నుంచి ఇంతకుముందే నిష్క్రమించడం తెలిసిందే.