: పోలీస్ స్టేషన్ కు వచ్చి చిక్కుల్లో పడిన మోడల్ భామలు
ముంబైలో ఇద్దరు మోడల్ భామలు ఓ మహిళా కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకెళితే... తమ పట్ల వేధింపులకు పాల్పడిన వ్యక్తులు అందరినీ అరెస్టు చేయాలంటూ పూజా మిశ్రా, శ్రుతి అనే మోడళ్లు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముగ్గురినే అరెస్టు చేశారని, మరో వ్యక్తి కూడా తమను వేధించాడని, అతడిని కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, తమ మాటను లక్ష్యపెట్టలేదంటూ ఆ మోడల్ భామలు కోపంతో పోలీసులపై చిందులేశారు. తమను వేధించిన వారిలో నాలుగో వ్యక్తిని కూడా అరెస్టు చేయాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఈ క్రమంలో అక్కడున్న మహిళా కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేశారు. దీంతో, పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. పోలీస్ స్టేషన్ కు వచ్చి, అందునా పోలీసుపైనే ఎగిరిపడతారా? అంటూ ఆ మోడళ్లపై కేసు నమోదు చేశారు.