: ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ పర్యటనకు 'దీదీ'
బంగ్లాదేశ్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వెళుతున్నారు. జూన్ 6, 7 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్ లో పర్యటిస్తారు. మోదీతో దీదీ కూడా వెళుతున్నారని రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీ తెలిపారు. ఆయన కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ... ఈ పర్యటన రెండు బెంగాల్ ల మధ్య, రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. రెండు బెంగాల్ ల మధ్య తేడాలు లేవని, ఒకే భాష మాట్లాడతామని వివరించారు. అలాగే, ఇరు దేశాలకు జాతీయ గీతాలున్నాయని, వాటి సృష్టికర్త (రవీంద్రనాథ్ టాగోర్) ఒక్కరేనని చెప్పారు. కాగా, ప్రధాని బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రయోజనాలపై రాజీ ఉండబోదని విశ్వసిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ను 'తూర్పు బెంగాల్' అని కూడా పిలుస్తారన్న సంగతి తెలిసిందే.