: ఇండియాలో రహస్యంగా పర్యటించిన ప్రపంచ కుబేరుడు!


బిల్ గేట్స్ తరువాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధనవంతుడైన కార్లోస్ స్లిమ్ తన వ్యాపార విస్తరణలో భాగంగా భారత టెలికం రంగంపై కన్నేశాడని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలోని టెలికం సంస్థ అమెరికా మోవిల్, మెక్సికోలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, దాన్ని గట్టెక్కించేందుకు భారత టెలికంలతో భాగస్వామ్యాలు సహకరిస్తాయని కార్లోస్ భావిస్తున్నారని సమాచారం. అందుకోసం రెండు వారాల క్రితం ఇండియాలో కార్లోస్ రహస్యంగా పర్యటించి వెళ్లారని, ఇక్కడి టెలికం సంస్థలతో పాటు ఈ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తున్న ఇతర వ్యాపార సంస్థలతోనూ ఆయన చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సుమారు 77.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,93,400 కోట్లు) ఆస్తులున్న కార్లోస్ స్లిమ్, తన ఇండియా పర్యటనలో భాగంగా విడియోకాన్ గ్రూపు సంస్థల చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ను, కొన్ని ఇతర మొబైల్ కంపెనీల ప్రతినిధులనూ కలిసినట్టు తెలిసింది. మెక్సికో 'వారెన్ బఫెట్'గా అభిమానులు పిలుచుకునే కార్లోస్, ఇక్కడి టెలికం రంగ వృద్ధి అవకాశాలను తెలుసుకొని ఆశ్చర్యపోయినట్టు ఓ టెలికం సంస్థ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. టెలికంతో పాటు విద్య, ఆరోగ్యం, పారిశ్రామికోత్పత్తి, ఆహారం, పానీయాలు, నిర్మాణ రంగం, విమానాలు, మీడియా, గనులు, చమురు, ఆతిథ్యం, వినోదం, సాంకేతికం, ఆర్థిక సేవా రంగాల్లోనూ ఆయన పెట్టుబడులకు ఆసక్తిని చూపారని, అయితే, టెలికం రంగంలో తొలుత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని వివరించారు. కాగా, ఈ విషయంలో అమెరికా మోవిల్ ప్రతినిధిని సంప్రదించగా, స్లిమ్ భారత పర్యటనపై ఇప్పటికిప్పుడు స్పందించలేమన్న సమాధానం వచ్చింది.

  • Loading...

More Telugu News