: ఇప్పటికే నన్ను అంతా గవర్నర్ అని పిలుస్తున్నారు!: మోత్కుపల్లి


తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ చాన్స్ దక్కబోతోందంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా ఆయనే స్పందించారు. ఈ మేరకు మహానాడులో మోత్కుపల్లి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తనను మంత్రిని చేస్తే, చంద్రబాబు గవర్నర్ ని చేస్తానంటున్నారని చెప్పారు. ఇందుకు తన పక్షాన, దళిత బిడ్డల పక్షాన చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని మోత్కుపల్లి అన్నారు. గత నెలా, రెండు నెలల నుంచి ఎక్కడికి వెళ్లినా తనను అంతా గవర్నర్ అని పిలుస్తున్నారని, ఇది దాచుకున్నా దాగేది కాదని పేర్కొన్నారు. ఈ సమయంలో వేదికపై కూర్చున్న చంద్రబాబు సహా అందరి ముఖాలపై నవ్వులు పూశాయి. ఏది ఏమైనా మీ ఆశీర్వాదంతో ఏదిచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం, ఎన్టీఆర్ ఆశయాల కోసం మీ అనుచరుడిగా, మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డా ఈ మోత్కుపల్లి ఓర్చుకోలేడని సభాముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఆ తరువాత అక్కడే ఉన్న చంద్రబాబు స్పందిస్తూ, మోత్కుపల్లి గవర్నర్ అయితే తమకు మంచి వక్త కరవౌతారని చమత్కరించారు.

  • Loading...

More Telugu News