: నిన్ను రెండు సార్లు కాపాడాను... అవునా? కాదా?: నితీష్ కు గతం గుర్తు చేసిన లాలూ
గత సంవత్సరం బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం పతనం కాకుండా తాను రెండు సార్లు కాపాడానని లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తు చేశారు. జనతా పరివార్ సీట్ల సర్దుబాటులో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తం ఆరు పార్టీల కలయికగా ఉన్న జనతా పరివార్, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన సంగతి తెలిసిందే. "మా ముందు ఉన్న కర్తవ్యం ఓ సవాలు వంటిది. నితీష్ ప్రభుత్వానికి నేను రెండు సార్లు సహకరించి, ప్రభుత్వం పడిపోకుండా కాపాడాను. పార్టీల విలీనం విషయమై నెలకొన్న సమస్యలను అందరం కలసికట్టుగా పరిష్కరించుకోవాలి" అని నితీష్ కుమార్ ను ఉద్దేశించి లాలూ వ్యాఖ్యానించారు. కాగా, బీహారుకు జనతా పరివార్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ను ప్రకటిస్తే బలహీనమవుతామన్నది ఆయన అభిప్రాయం. మరోవైపు ఓ అవినీతి కేసులో లాలూ దోషిగా తేలడంతో ఆయన సైతం ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే. ఈ విషయంలోనే పార్టీలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. నితీష్ రాజీనామా తరువాత పగ్గాలు చేపట్టిన మాంఝీని జేడీ-యూ నుంచి బహిష్కరించగా, తిరిగి ఆయనను ఆహ్వానించి జనతా పరివార్ లో చేర్చుకోవాలన్నది లాలూ అభిమతం. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను అధిగమించి ఎలా ముందుకు సాగుతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.