: రాష్ట్రపతి 'ఆఫ్ ది రికార్డ్'గా చెప్పిన దానిని ప్రచురించడం నిజాయతీ కాదు!: స్వీడన్ లో భారత రాయబారి
ఇంటర్వ్యూ సందర్భంగా నోరుజారిన అంశంపై, ఇంటర్వ్యూ అనంతరం 'ఆఫ్ ది రికార్డ్' (ప్రచురించరానిది)గా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన వివరణను కూడా జోడించి ప్రచురించడం నిజాయితీ అనిపించుకోదని స్వీడన్ లో భారత రాయబారి బన్ శ్రీ బోస్ హారిసన్ వ్యాఖ్యానించారు. ఓ స్వీడన్ పత్రిక ప్రణబ్ ను ఇంటర్వ్యూ చేసిన తరువాత ప్రచురించిన కథనం భారత రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బోఫోర్స్ కుంభకోణంపై ప్రణబ్ స్పందిస్తూ, అది కుంభకోణమని ఏ కోర్టూ తేల్చలేదని ప్రణబ్ చెప్పినట్టు స్వీడన్ పత్రిక ప్రచురించింది. ఆదివారం నుంచి రాష్ట్రపతి స్వీడన్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని ప్రచురించే ముందే 'బోఫోర్స్' పేరున్న కొన్ని వాక్యాలను తొలగించాలని కోరామని బన్ శ్రీ బోస్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ప్రచురించిన తరువాత రాష్ట్రపతి స్వీడన్ పర్యటన రద్దయ్యే అవకాశాలు పెరిగాయని ఆమె హెచ్చరించారు. దీనిపై ఆ పత్రిక ఎడిటర్ - ఇన్ - చీఫ్ పీటర్ వోలొడాస్కీ సైతం ఘాటుగానే స్పందించారు. భారత రాయబారి స్పందన విచారించదగ్గదని అన్న ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యక వ్యవస్థ ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి ఏం ప్రశ్నలను వేయాలో, ఆయన ఇచ్చిన సమాధానాలను ఎలా రాయాలో చెప్పే ప్రయత్నాలు జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.