: ప్రభుత్వం వద్దంటోంది...నా విధులు ఏంటి?: ఎల్జీకి లేఖ రాసిన సీఎస్
ఢిల్లీ తాత్కాలిక సీఎస్ నియామకం లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య చిచ్చురేపింది. ఈ వివాదం ముదిరి పాకానపడి రాష్ట్రపతి వరకు వెళ్లింది. రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆప్ వైఖరిలో కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ విధానంలో కానీ ఎలాంటి మార్పు సంభవించలేదు. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ కు మద్దతు పలకడంతో, ఆయన నియమించిన తాత్కాలిక చీఫ్ సెక్రటరీ శకుంతల గామ్లిన్ కు విధులు ఎలా నిర్వర్తించాలో అర్థం కావడం లేదు. ఆప్ ప్రభుత్వం విభేదిస్తున్న సమయంలో తన బాధ్యతలు, కార్యాచరణపై స్పష్టత నివ్వాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు లేఖ రాశారు. అంతే కాకుండా తనపై ఆప్ చేసిన అవినీతి ఆరోపణలపై ఆమె ఆ లేఖలో వివరణ ఇచ్చారు.