: మహానాడులో కేసీఆర్ పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి
ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులకు ఉద్యోగాలిస్తాం, ఉద్యమ వీరులుగా గుర్తిస్తాం అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కలలన్నీ నెరవేరుతాయని భావించిన విద్యార్థులు సమిధలుగా మారి ఉద్యమం చేపట్టారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ, అన్ని త్యాగాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగితే...బచ్చాగాళ్లు వాళ్లకేమీ తెలియదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. ఎన్నో ఆశలతో కలల సౌధమైన రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రానికి మంచి చేస్తాడని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపిస్తే, ప్రజలకు మంచి చేసే ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీలు, డబుల్ బెడ్రూం ఫ్లాట్, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య, అమరవీరులకు నజరానా, ఉద్యోగాలు, దళితులకు భూములు, నిరుద్యోగులకు ఉద్యోగాలు... ఇలా ఏ హామీ నెరవేర్చలేదని అన్నారు. ప్రతి సారీ పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదని చెప్పే కేసీఆర్, చంద్రబాబునాయుడు డీఎస్సీ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం గమనించాలని అన్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఖాళీలు భర్తీ చేయలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.