: పదవిని దుర్వినియోగం చేయలేదు ... స్వలాభానికి వాడుకోలేదు: ఆరోపణలపై స్పందించిన మన్మోహన్ సింగ్
రెండవ తరం రేడియో తరంగాల (2G) అప్పగింతలో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారిగా స్పందించారు. తాను పదవినెప్పుడూ దుర్వినియోగం చేయలేదని, స్వలాభానికి ఎంతమాత్రమూ వాడుకోలేదని ఆయన అన్నారు. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం పదవిని ఉపయోగించుకోలేదని ఆయన వివరించారు. ప్రాధాన్యతలేని పాత విషయాలను తోడుతూ, ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని ఆయన విమర్శించారు. తాము అధికారం నుంచి తప్పుకునేముందు ప్రపంచంలోనే ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. భారతావనిలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన వ్యాఖ్యానించారు.