: ఒబామా నిర్ణయాన్ని వ్యతిరేకించిన యూఎస్ కోర్టు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా దేశంలో ఉంటున్న వారిపై కరుణ చూపాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని యూఎస్ అపీల్ కోర్టు వ్యతిరేకించింది. న్యూ ఓర్లెన్స్ లోని కోర్టు ఒబామా అడ్మినిస్ట్రేషన్ విభాగం చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుమారు 40 లక్షల మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తుండగా, వీరందరినీ వారి దేశాలకు వెనక్కు పంపకుండా క్షమించాలన్నది ఒబామా ఆలోచన. ఇందుకోసం గత నవంబరులో ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. ఇది ఫిబ్రవరి 2015లో అమలు కావాల్సి వుండగా, టెక్సాస్ కోర్టు కల్పించుకుని అత్యవసర ఇన్ జంక్షన్ ఆదేశాలిస్తూ, ఈ ఆర్డర్ పై విచారణ జరపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు తమకు నిరుత్సాహాన్ని కలిగించాయని డెమోక్రాట్ ప్రతినిధి న్యాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో మరింత పారదర్శకత తేవాలని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు వస్తున్నాయని ఆమె అన్నారు. కాగా, హౌస్ స్పీకర్ జాన్ బోయిహ్నర్ మాత్రం కోర్టు ఆదేశాలను సమర్థించారు. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసే అర్హత ఒబామాకు లేదని స్పష్టం చేశారు.