: చిన్న కార్ల మధ్య పెను పోరు!


ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఏది?... ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసే ఉంటుంది. అదే మారుతి ఆల్టో. ఏడాదికి 26 లక్షల కార్ల విక్రయాలు జరిగితే, అందులో 10 శాతం వాటా ఆల్టోదే. 2014-15లో 2.64 లక్షల ఆల్టో యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. తక్కువ ధరతో పాటు 800 సీసీ సెగ్మెంటులో ఉండడమే ఆల్టో విజయానికి ముఖ్య కారణమని భావించిన ఇతర కంపెనీలు, 800 సీసీ విభాగంలో తమతమ ఉత్పత్తులను విడుదల చేసేందుకు ప్లాన్లు రూపొందించాయి. దీంతో భవిష్యత్తులో చిన్న కార్ల మధ్య పెను పోరు సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హ్యుందాయ్ సంస్థ 'ఇయాన్'తో రంగంలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 78 వేల యూనిట్లకు పైగా ఇయాన్ అమ్మకాలు నమోదయ్యాయి. ఈ విభాగంపై కన్నేసిన రెనో ఇటీవలే 'క్విడ్'ను పరిచయం చేసింది. ఈ కారు అభివృద్ధికి, చెన్నయ్ ప్లాంటు విస్తరణకు కలిపి రూ. 2 వేల కోట్ల వరకూ కంపెనీ ఖర్చు చేసింది. దేశవిదేశీ మార్కెట్లలో సాలీనా 10 లక్షల యూనిట్లను విక్రయిస్తామని ధీమాగా చెబుతోంది. ఇక మరో కార్ల దిగ్గజం టాటా 'పెలికాన్' అనే కోడ్ నేమ్ తో 800 సీసీ డీజిల్ కారును సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. జనరల్ మోటార్స్ తామందిస్తున్న 'షవర్లే స్పార్క్' ప్లాట్ ఫాంపై కారును అభివృద్ధి చేసి, ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువ ధరకు అందించాలని భావిస్తోంది. వచ్చే సంవత్సరం విడుదలయ్యేలా నిస్సాన్ 'రెడీ-గో' పేరిట చిన్న కారును విడుదల చేస్తామని చెబుతోంది. ఈ కార్ల ధరలన్నీ రూ. 2.5 లక్షల నుంచి మొదలవుతాయి. దీంతో సమీప భవిష్యత్తులో ఏ కారును ప్రజలు ఆదరిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మరి కొంతకాలం ఆగితేనే, ఆల్టో అగ్రస్థానం నిలుస్తుందా? లేదా అన్న విషయం తేలనుంది.

  • Loading...

More Telugu News