: ఢిల్లీకి వచ్చిన బ్లాక్ బ్యూటీ, పెర్రీ బ్లాక్ మ్యాజిక్ బర్గర్లు
భారత్ లో భోజన ప్రియులు ఎక్కువ. రాష్ట్రానికో సంప్రదాయ ఆహారం భారత్ లో లభ్యమవుతుంది. పోషక విలువలు, అమోఘమైన రుచులు భారత్ ఆహారం సొంతం. అయినప్పటికీ మనకి పాశ్చాత్య ఆహారం అంటే తగని మక్కువ. అందుకే ఏ రెస్టారెంట్ కెళ్లినా, చైనీస్, ఇటాలియన్, జపనీస్, థాయ్, ఎడారి దేశాల తందూరీలే ప్రముఖంగా కనిపిస్తాయి. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఢిల్లీ జంక్ ఫుడ్ ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు బార్ సెలోస్ అనే అంతర్జాతీయ బర్గర్ల సంస్థ అవుట్ లెట్ ప్రారంభించింది. యూఎస్, జపాన్ లో ఎన్నో అవుట్ లెట్లతో నడుస్తున్న ఈ సంస్థ, భారత్ లో తొలి బ్లాక్ బర్గర్ అవుట్ లెట్ ను ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో ప్రారంభించింది. ఇందులో రెండు రకాలైన్ బ్లాక్ బర్గర్లు లభిస్తాయని వారు తెలిపారు. బ్లాక్ బర్గర్ మామూలు బర్గర్ లాంటిది కాదని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని అవుట్ లెట్ నిర్వాహకులు తెలిపారు. బ్లాక్ బ్యూటీ (155 రూపాయలు) వెజ్ బర్గర్, పెర్రీ బ్లాక్ మ్యాజిక్ (195 రూపాయలు) నాన్ వెజ్ బర్గర్లు భోజన ప్రియులకు అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. సాధారణ బర్గర్లు తినితినీ బోర్ కొట్టిన వారు, ఛేంజ్ కోరుకునే వారు ఢిల్లీ వెళ్లినప్పుడు ఖాన్ మార్కెట్ లో ఉన్న ఈ అవుట్ లెట్ సందర్శించి రుచి చూడచ్చు.