: ఆ పాప కిడ్నీలకు 'మాయ' రోగం!
ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. దానిపై బాధితులు చేసిన ఫిర్యాదును వైద్యులు పట్టించుకోకపోవడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్ బరేలీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తోపుడు బండిపై జ్యూస్ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె దీపిక (6) గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. బరేలీ వైద్యుల సూచనతో తన కుమార్తెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకువచ్చారు. ఎయిమ్స్ లో పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, బాలిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని తెలిపారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీ తొలిగిస్తామని చెప్పారు. ఎడమ కిడ్నీ తొలగించే క్రమంలోనే గత మార్చి 17న పిడియాట్రిక్ విభాగంలోని సీనియర్ సర్జన్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తరువాత బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె రెండు కిడ్నీలు కనబడలేదు. దీంతో దీపిక తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. దీంతో శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ సర్జన్ ను నిలదీశారు. దానికి అతను 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే కిడ్నీ, దానిని నేను తీసేశా, అసలు పాపకి రెండు కిడ్నీలు లేనేలేవు' అన్నాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ పై చికిత్స అందిస్తున్నారు.