: ఈమె నడిచే బార్బీ బొమ్మ!
చిన్నారులు ఆడుకునే బొమ్మల్లో బార్బీది ప్రత్యేక స్థానం. ముచ్చటగా కనిపించే ఈ అమ్మాయి బొమ్మను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఆ బొమ్మకు వారే హెయిర్ డ్రెస్సర్లు, మేకోవర్ స్పెషలిస్టులు! బార్బీ ప్లాస్టిక్ జుట్టును ఇష్టం వచ్చిన రీతిలో ముడులు వేసి మురిసిపోతుంటారు. తమకు నచ్చిన డ్రెస్సులు తగిలించి కేరింతలు కొడతారు. ఆ బొమ్మ రమణీయత అలాంటిది. మరి, అంత అందమైన బార్బీ బొమ్మకు ప్రాణం వస్తే...! అద్భుతంగా ఉంటుంది కదూ. అయితే, బార్బీ బొమ్మ ప్రాణం పోసుకోకపోయినా, ఈ 26 ఏళ్ల రష్యా అమ్మాయి మాత్రం అచ్చం బార్బీలాగే పెరిగింది. మాస్కో నగరంలోని ఏంజెలికా కినోవో ప్రఖ్యాత మోడల్. మోడల్ అంటే ఆమె లైఫ్ స్టయిల్ గురించి ఏవేవో ఊహించుకునేరు! ఆమె తల్లిదండ్రులు కినోవాను ప్రత్యేకంగా పెంచారు... అచ్చం బార్బీ బొమ్మలా! ఆమె హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ అంతే తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. బాయ్ ఫ్రెండ్స్ లేరు... ఇక డేటింగ్ ఎవరితో చేస్తుంది చెప్పండి. ఒకవేళ కినోవా బయటికి వెళ్లాల్సి వస్తే తల్లి వెంట ఉండాల్సిందే. చిన్నప్పటి నుండి తనను ఓ యువరాణిలా పెంచారని ఈ 'లివింగ్ బార్బీ' తెలిపింది. తాను బతికున్న బార్బీనని చెప్పుకొచ్చింది.