: 9 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు... సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే!


ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం అండర్-14 వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ఓ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. ముషీర్ ఖాన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఓ ఇన్నింగ్స్ లో 9 పరుగులిచ్చి 9 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దాదర్ యూనియన్ జట్టు తరపున ఆడుతూ ముషీర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉండడం విశేషం. విరార్ జట్టుతో రెండు రోజుల మ్యాచ్ లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ (14-9-9-9) గణాంకాలు చూస్తే అచ్చెరువొందుతారు. ఇన్నింగ్స్ లో 14 ఓవర్లు బౌల్ చేయగా అందులో 9 ఓవర్లు మెయిడెన్లే. ఈ బాల మేధావి బౌలింగ్ కు విరార్ జట్టు బ్యాట్స్ మెన్ విలవిల్లాడిపోయారు. అంతేగాదు, బ్యాటింగ్ లోనూ రాణించాడు. 152 బంతుల్లో 48 పరుగులు చేసి తన జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ముషీర్ ఖాన్ కు సంచలనాలు కొత్త కాదు. 2013 ఆగస్టులో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ లో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను అవుట్ చేసి విశేష ప్రాచుర్యం సంపాదించాడు. అన్నట్టు... ఈ ముషీర్ ఖాన్ ఎవరో కాదు. ఐపీఎల్ తాజా సీజన్ లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే. సర్ఫరాజ్ ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున విలువైన పరుగులు సాధించాడు. గేల్, డివిలియర్స్ వంటి దిగ్గజాలు ఉన్న జట్టు తరపున ఆడుతూ అందరినీ ఆకట్టుకోవడం మామూలు విషయం కాదుకదా!

  • Loading...

More Telugu News