: వానరానికీ తప్పని వడదెబ్బ... రక్షించిన స్థానికులు
మండుటెండలతో తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. వందలాది మంది వడదెబ్బకు ప్రాణాలు సైతం వదిలారు. భానుడి ప్రతాపానికి జంతువులు సైతం విలవిలలాడుతున్నాయి. ఈ క్రమంలో, జనగామలోని సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ వద్ద ఓ వానరం వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. తల్లి పడిపోవడంతో దాంతో పాటే ఉన్న పిల్ల వానరానికి ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తుండిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు, వడదెబ్బకు గురైన కోతికి గ్లూకోజ్ వాటర్, పాలు తాగించారు. గోనె సంచిని చల్లటి నీటిలో తడిపి దానిపై ఉంచి చల్లబరిచారు. అనంతరం అరటిపండు తినిపించి, నీళ్లు తాగించారు. కాసేపటి తర్వాత తల్లి కోతి కోలుకుంది. అక్కడకు చేరుకున్న జేఏసీ నేత వానరానికి అవసరమైన చికిత్స కోసం పశువైద్యుడికి సమాచారం అందించారు. వానరమే కదా అని వదిలేయకుండా, దాన్ని రక్షించిన స్థానికులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.