: 'మైమ్ త్రూ టాలీవుడ్'తో ఊపేస్తున్న ముగ్గురమ్మాయిలు!
ఆస్ట్రేలియాతో పాటు మొత్తం హాలీవుడ్ ను, బాలీవుడ్ ను ఊపేసిన 'మైమ్ త్రూ' వీడియో స్పూర్తిగా కావ్య, కమలి, శ్రుతి అనే ముగ్గురు యువతులు చేసిన 'మైమ్ త్రూ టాలీవుడ్' వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తెలుగు సినిమాల్లో అలనాటి గీతాల నుంచి నేటి గీతాల వరకు ఓ అద్భుతమైన సినీ ప్రయాణాన్ని వారు వీడియోలో అభిమానులకు రుచి చూపించారు. కేవలం కారు సీటులోనే కూర్చుని, పాటకు తగ్గ కాస్ట్యూమ్స్ తో చూడచక్కని హావభావాలతో ఆ ముగ్గురూ వీడియోను రక్తి కట్టించారు. రాకేష్ అనే యువకుడి సాంకేతిక సహకారంతో ఇద్దరు బీటెక్ అమ్మాయిలు, ఒక డిగ్రీ స్టూడెంట్ కలసి ఎవరూ చేయని ఓ ప్రయత్నాన్ని ధైర్యంగా చేసి, విజయం సాధించారు. ఈ నెల 22న అర్ధరాత్రి వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే, తెల్లవారే సరికి పది వేల షేర్లు వచ్చాయని వారు చెప్పారు. ఈ వీడియో కోసం కేవలం మూడు గంటలు ప్రాక్టీస్ చేశామని వారు చెప్పారు. కాస్ట్యూమ్స్ కోసం తమ ముగ్గురి దగ్గరున్న డ్రెస్సులన్నిటినీ ఒకచోట పోసి, వాటిల్లోంచి ఎవరికి ఏవి సూట్ అవుతాయో అవే తీసుకుని వేసుకున్నామని వారు చెప్పారు. లైటింగ్, ఇతర సాంకేతిక సహకారాలేవీ తీసుకోలేదని వారు చెప్పారు. తమకున్న వనరులతో తమ అపార్ట్ మెంట్ బయట సాయంత్రం సమయంలో కార్లో దీనిని షూట్ చేశామని వారు చెప్పారు. పాటలు కూడా తామంతా కలిసి ఎంచుకుని వీడియోను విడుదల చేశామని వారు చెప్పారు. ప్రతి పాటకు కాస్ట్యూమ్స్ మార్చేందుకు 3 అంతస్తులు ఎక్కి దిగాల్సి వచ్చినా, అది కష్టం కాలేదని వారు వెల్లడించారు. తెలుగు సినీ రంగంలోని ప్రతి హీరోనూ తమ పాటల ద్వారా గుర్తుచేయాలని భావించినప్పటికీ వీడియో లెంగ్త్ వల్ల అది సాధ్యం కాలేదని వారు వెల్లడించారు.